jagan: తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ను కలిసిన అమరావతి రైతులు!

  • తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర
  • కుయ్యేరు వద్ద జగన్ ను కలసిన అమరావతి ప్రాంత రైతులు
  • మరింత భూమిని లాక్కునేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, గ్రామస్తులు వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కుయ్యేరు వద్ద రైతులు కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బెదిరించి, తమ వద్ద నుంచి ఇప్పటికే 54 వేల ఎకరాలను లాక్కున్నారని ఈ సందర్భంగా జగన్ వద్ద వాపోయారు. భూములు ఇవ్వకపోతే, ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుని, స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ప్రకటిస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తమకు సబ్సిడీలు, రుణాలు, నీరు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి కావాల్సింది 900 ఎకరాలు మాత్రమేనని... ఆ భూమిలో ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా చేపట్టకుండా, మరింత భూమి కోసం తమను వేధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. 

More Telugu News