jakir nayak: అవన్నీ అవాస్తవాలు.. నేను ఇండియాకి రావడం లేదు: వివాదాస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్

  • మలేషియాలో తలదాచుకున్న జకీర్ నాయక్
  • ఇండియాకు తిరిగి వస్తున్నాడంటూ వార్తలు
  • భారత్ లో రక్షణ ఉంటుందనే భావన కలిగినప్పుడే వస్తా

మలేషియాలో తలదాచుకున్న వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఇండియాకు తిరిగి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, తాను ఇండియాకు తిరిగి రావడం లేదని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే, జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలకు ఆకర్షితుడైన ఓ వ్యక్తి ఐసిస్ లో చేరి, 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దాడులకు తెగబడ్డాడు. జకీర్ ప్రసంగాలతో తాను ఎంతో ఉత్తేజితుడ్నయ్యానని అతను చెప్పుకున్నాడు. ఈ వార్త కలకలం రేపగా జకీర్ భారత్ నుంచి పారిపోయి మలేషియాలో తలదాచుకున్నారు.

తాజాగా, మలేసియా నుంచి జకీర్ ఇండియాకు బయల్దేరుతున్నాడంటూ మలేషియా ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి నుంచి సమాచారం అందింది. దీనిపై జకీర్ స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తన పట్ల భారత ప్రభుత్వం న్యాయంగా వ్యవహరిస్తుందన్న భరోసా కలిగినప్పుడు, తనకు రక్షణ ఉంటుందన్న భావన కలిగినప్పుడు మాత్రమే... స్వదేశానికి వస్తానని చెప్పారు.

జకీర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, జకీర్ ను మలేషియా ప్రభుత్వం భారత్ వెళ్లిపొమ్మని చెప్పలేదని తెలిపారు. జకీర్ కు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పారు. మలేషియా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేంద్ర హోంశాఖ కూడా తెలిపింది. టెర్రరిస్టులకు అనుకూలంగా ఉన్న జకీర్ నాయక్ ను అప్పగించాలంటూ మలేషియాను భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News