special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం: సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

  • ఏపీకి అన్నీ ఇచ్చేశాం.. ఇవ్వాల్సింది ఏమీ లేదు
  • మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేం
  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదనే విషయం స్పష్టమైంది. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఏపీకి ఇచ్చేశామని, ఇక ఇచ్చేదేమీ లేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ అధికారికంగా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది.

 రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని తెలిపింది. ఈ అఫిడవిట్ లో విశాఖ రైల్వే జోన్ ఊసే లేకపోవడం గమనించాల్సిన విషయం. ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడంలేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో ఈ మేరకు స్పష్టతను ఇచ్చింది.

రాష్ట్ర విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూ లోటు కేవలం రూ. 4,116 కోట్లు మాత్రమేనని... ఇప్పటి వరకు రూ. 3,979 కోట్లు ఇచ్చామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చామని... యూసీలు సమర్పించిన తర్వాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల వంతున చెల్లిస్తామని చెప్పింది. 

More Telugu News