mihir jain: బరువు తగ్గిన బాలభీముడు... గతంలో 237 కిలోలు... ఇప్పుడు 165 కిలోలు

  • ఆహార నియమాలతో 40 కిలోలు తగ్గుదల
  • బేరియాట్రిక్ సర్జరీతో మరో 30 కిలోలు తగ్గించిన వైద్యులు
  • వచ్చే మూడేళ్లలో 100 కిలోలు తగ్గి 65 కిలోలకు చేరాలన్న లక్ష్యం

చిన్న వయసులోనే భారీ స్థూలకాయంతో బాధపడుతున్న ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల మిహిర్ జైన్ మొత్తం మీద 70కిలోల బరువు తగ్గాడు. ఢిల్లీకి చెందిన మ్యాక్స్ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఇది సాధ్యపడింది. ప్రపంచంలోనే భారీ బరువున్న బాలుడిగా మిహిర్ జైన్ గుర్తింపు పొందాడు. తనకున్న సమస్యతో సరిగా నడవలేకపోవడం, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మ్యాక్స్ ఇనిస్టిట్యూట్ ను గతేడాది డిసెంబర్ లో సంప్రదించాడు. దీంతో వైద్యులు ఆహార నియంత్రణ పద్ధతులు సూచించగా, అవి పాటించి మిహిర్ 40కిలోల బరువు తగ్గాడు.

తాజాగా వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహణతో మరో 30కిలోల బరువు తగ్గించారు. దీంతో మిహిర్ 165 కిలోలకు తగ్గాడు. రానున్న మూడేళ్లలో మరో 100 కిలోల బరువు తగ్గాలన్నది అతడి లక్ష్యం. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ ద్వారా వైద్యులు లోపలికి తీసుకునే ఆహార పరిమాణాన్ని నియంత్రించారు. దీంతో తక్కువ కేలరీలు వెళతాయి. మిహిర్ 2003లో జన్మించిన సమయంలో 2.5 కిలోల బరువే ఉన్నాడు. 5 ఏళ్లు వచ్చేసరికి 65 కిలోలకు పెరిగిపోయాడు. మిహిర్ కుటుంబ సభ్యులకూ స్థూలకాయం సమస్య ఉంది.

More Telugu News