CAT Card: బస్సెక్కితే ఇక రాయితీలు లేవు... క్యాట్, వనిత కార్డులను నిలిపివేసిన ఏపీ సర్కారు

  • చిల్లర సమస్యతోనే కార్డుల జారీ నిలిపివేత
  • నేటి నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
  • దాదాపు 7 లక్షల మందిపై ప్రభావం

ఆంధ్రప్రదేశ్ లో తరచూ బస్సుల్లో ప్రయాణించే ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే క్యాట్, వనిత ఫ్యామిలీ కార్డులను నిలిపివేయాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. లక్షలాది మందికి టికెట్ ధరపై పది శాతం రాయితీని, ప్రమాద బీమాను అందిస్తున్న ఈ కార్డుల విక్రయాలు నేటి నుంచి ఆగిపోయాయి. ఈ ప్రభావం దాదాపు 7 లక్షల మందిపై పడనుండగా, ఇప్పటికే కార్డులను కొనుగోలు చేసిన వారు, వాటి కాలపరిమితి ముగిసేంత వరకూ వాడుకోవచ్చు.

చిల్లర సమస్యతో టికెట్ల ధరలను రూ. 10, రూ. 15, రూ. 20... అంటూ రౌండ్ ఫిగర్ చేసిన తరువాత, పది శాతం రాయితీపై టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించిన అధికారులు, ఈ కార్డుల రద్దుపై వారం రోజుల పాటు చర్చించామని, ఆర్థికంగా లాభదాయకం కాదన్న నిర్ణయానికి వచ్చిన తరువాత మాత్రమే వీటి జారీని నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఉదాహరణకు రూ. 30 టికెట్ ఉన్న రూట్ లో పది శాతంగా రూ. 3 రాయితీ ఇస్తే, రూ. 27 చెల్లించడం ప్రయాణికులకు, రూ. 3ను చిల్లరగా చెల్లించడం కండక్టర్లకు ఇబ్బందిగా మారిందని వెల్లడించారు. కొన్ని చోట్ల ప్రయాణికులకు అసలు రాయితీ దక్కడం లేదని అన్నారు. కాగా ప్రస్తుతం నవ్య క్యాట్ (కన్సెషనల్ యాన్యువల్ ట్రావెల్) కార్డులను 10.71 లక్షల మంది కొనుగోలు చేశారు. వనిత ఫ్యామిలీ కార్డులను రూ. 6.21 లక్షల మంది తీసుకున్నారు. ఇకపై కార్డులను జారీ చేయకుంటే, గరిష్ఠంగా రెండు సంవత్సరాల వ్యవధిలో అన్ని కార్డులూ చెల్లుబాటు కాకుండా పోతాయి.

More Telugu News