New Delhi: ఢిల్లీని పాలించాల్సింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే... ఎల్జీ కాపలాదారు మాత్రమే!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • ఢిల్లీ ముఖ్యమంత్రి నిర్ణయాలే ఫైనల్
  • నచ్చకుంటే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలి
  • స్నేహపూర్వకంగా ఎల్జీ, ప్రభుత్వం వ్యవహరించాలి
  • తీర్పు సందర్భంగా జస్టిస్ చంద్రచూద్

న్యూఢిల్లీని పరిపాలించాల్సింది ఎవరు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా? లేక కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నరా? ఆప్ సర్కారు, ఎల్జీ మధ్య జరుగుతున్న కోర్టు కేసులో అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. లెఫ్టినెంట్ గవర్నర్ ను ఓ కాపలాదారుగా వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఢిల్లీ ప్రజలను పాలించాల్సింది వారు ఎన్నుకున్న ప్రభుత్వమేనని తేల్చి చెప్పింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, తన మంత్రివర్గ సహచరులతో చర్చించి ఎటువంటి నిర్ణయాన్ని అయినా తీసుకోవచ్చని, అయితే, ఆ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలియజేయాల్సి వుంటుందని రాజ్యాంగంలో స్పష్టంగా రాసుందని పేర్కొంది.

ఇదే సమయంలో ఎల్జీ సమ్మతి కోసం వేచి చూడక్కర్లేదని తెలిపింది. ఎల్జీ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకుంటే, ఆ విషయాన్ని రాష్ట్రపతికి చేరవేయాలే తప్ప, మొండిపట్టు పట్టరాదని తెలిపింది. ఈ కేసు ఎంతో ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డ జస్టిస్ చంద్రచూద్, ప్రజల నిర్ణయాన్ని ఎవరైనా ఆమోదించాల్సిందేనని అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోవచ్చని, ప్రతి విషయానికీ అడ్డుపడరాదని తీర్పు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోలేరని ఆయన అన్నారు. అటు ఎల్జీ, ఇటు సీఎం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే ఎటువంటి సమస్యా ఉండదని అభిప్రాయప్డారు. ఇక ఈ తీర్పు చాలా బాగుందని మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ వ్యాఖ్యానించారు.

More Telugu News