Kailash: ముక్కు, చెవుల్లోంచి రక్తం వస్తోంది.. కాపాడండి!: హిమాలయాల్లో చిక్కుకున్న విజయవాడ మహిళ ఫోన్

  • మంచు తుపానులో చిక్కుకున్న యాత్రికులు
  • హిల్సా వద్ద నరకయాతన
  • క్షేమంగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే హామీ

భారీ వర్షాలు, వరదలు, అనుకూలించని వాతావరణం కారణంగా అమర్ నాథ్, కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమను సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెనక్కు తీసుకెళ్లాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. తమ ఆరోగ్యం బాగాలేదని, తినడానికి తిండి కూడా దొరకడం లేదని, ముందుకు, వెనక్కు వెళ్లలేక అవస్థలు పడుతున్నామని వారు ఫోన్లు చేసి బంధువులకు చెబుతున్నారు.

మానస సరోవరం యాత్రకు వెళ్లిన విజయవాడ, పోరంకి ప్రాంతానికి చెందిన స్వరూపరాణి అనే గృహిణి, తన బంధువులకు ఫోన్ చేసి, తీవ్రమైన చలి కారణంగా ముక్కు, చెవుల్లోంచి రక్తం వస్తోందని, చనిపోయేలోగా అక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరింది. హిల్సా దగ్గరున్న తన బ్యాచ్ లో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందని వాపోయింది. ఆ విషయాన్ని స్వరూప బంధువులు అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన బంధువులు, ఆమెను వెంటనే తెచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. స్వరూప కుటుంబీకులను కలిసిన స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఆమెను సురక్షితంగా తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లూ చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News