USA: 'హీరో' పోజుకొట్టి... అమ్మాయిని మోసం చేసి, అమెరికా చెక్కేస్తూ అడ్డంగా దొరికిపోయిన కుర్రాడు!

  • మ్యాట్రిమోనియల్ సైట్ లో తప్పుడు ప్రొఫైల్
  • నమ్మిన యువతిని అడ్డంగా దోచేసిన యువకుడు
  • అమెరికా వెళుతుంటే పట్టుకున్న ఇమిగ్రేషన్ అధికారులు

మోసాలు చేయడానికి కొందరు కుర్రాళ్లు కొత్త కొత్త మార్గాలను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాడు కూడా ఆ బాపతే. చదివింది బీటెక్. అమెరికాలో వ్యాపారం. రెండేళ్ల క్రితం అక్కడే పెళ్లి చేసుకున్నాడు కూడా. అయినా, డబ్బు కోసం మోసాల దారి పట్టాడు. యూఎస్ అబ్బాయిలంటే, అమ్మాయిల్లో క్రేజ్ ఉంటుందని భావించి, దాన్ని క్యాష్ చేసుకున్నాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు.

 సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, మియాపూర్ కు చెందిన రాజూరి విక్రమ్ (26) 2015లో యూఎస్ వెళ్లి, డల్లాస్ లో వ్యాపారం ప్రారంభించాడు. గత సంవత్సరం అక్టోబర్ లో 'షాదీ డాట్ కామ్' వెబ్ సైట్ లో తమిళ హీరో సుజో మాథ్యూ ఫొటోను ఉంచి, తన తల్లి చిత్రంగా ప్రముఖ శాస్త్రవేత్త స్వాతి పరిమళ్ ఫొటో పెట్టాడు.

ఈ క్రమంలో విక్రమ్ కు కూకట్ పల్లికి చెందిన ఓ యువతి పరిచయం అయింది. సోషల్ మీడియాలో వారి పరిచయం పెరుగగా, వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆపై తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, చికిత్సకు చాలా డబ్బు అవసరమని, కొంత సర్దాలని కోరగా, కాబోయే భర్తేనన్న ఉద్దేశంతో బాధితురాలు రూ. 6.67 లక్షలను అతని ఖాతాలో జమ చేసింది. ఆ డబ్బులు చేతికి అందిన తరువాత విక్రమ్ స్పందించలేదు. తాను మోసపోయానని గమనించిన ఆమె, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వారు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఇక గత నెలలో అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన విక్రమ్, తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించి, ఎయిర్ పోర్టులోని ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా అతని పేరు లుక్ అవుట్ నోటీసులో చూసిన అధికారులు, ఆయన్ను అరెస్ట్ చేసి, పాస్ పోర్టును సీజ్ చేశారు. విక్రమ్ ఇంకా ఎవరినైనా మోసం చేశాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News