Deve Gouda: ఇక సినిమాలు వద్దులే... మనవళ్లను రాజకీయాల్లోకి తేనున్న దేవెగౌడ!

  • ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్న దేవెగౌడ
  • కుమారస్వామి కొడుకు నిఖిల్, రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ లకు అవకాశం
  • ఇద్దరు మనవళ్ల రాజకీయ అరంగేట్రానికి ఏర్పాట్లు

కర్ణాటకలో కాంగ్రెస్ సహకారంతో తన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండగా, ఎనిమిది పదుల వయసులోనూ ఉత్సాహంగా రాజకీయాల్లో పాల్గొంటున్న దేవెగౌడ, ఇక తన మనవళ్లను రాజకీయాల్లోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కుమారస్వామి కొడుకు నిఖిల్, ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండగా, అతన్ని రాజకీయాల్లోకి తేవాలని దేవెగౌడ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేసిన చెన్నపట్టణ, రామనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు కోలార్ తదితర జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ఈ 'జాగ్వార్' హీరో, లోక్ సభ ఎన్నికల్లో తుముకూరు నుంచి బరిలోకి దిగనున్నారట. ఈ విషయాన్ని నిన్న జరిగిన ఓ సమావేశంలో జేడీఎస్ తుముకూరు జిల్లా అధ్యక్షుడు స్వయంగా తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను గుడ్ బై చెబుతూ, ఇద్దరు మనవళ్ల రాజకీయ అరంగేట్రాన్ని దగ్గరుండి జరిపించాలన్నది దేవెగౌడ అభిమతంగా తెలుస్తోంది.

ఇక తన పెద్ద కొడుకు రేవణ్ణ ప్రస్తుతం కర్ణాటక సర్కారులో ప్రజా పనుల శాఖకు మంత్రిగా ఉండగా, ఆయన కుమారుడు ప్రజ్వల్ ఇప్పటికే చురుకుగా పర్యటనలు చేస్తున్నారు. తన తండ్రి గెలుపుకోసం, హసన్ జడ్పీ ఎన్నికల్లో తల్లి భవానీ గెలుపు కోసం ఎంతో శ్రమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ను కోరినప్పటికీ, ఒక ఇంటి నుంచి ఇద్దరికన్నా ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వకూడదన్న జేడీఎస్ సూత్రానికి విరుద్ధంగా వ్యవహరించలేమంటూ ప్రజ్వల్ ను దేవెగౌడ దూరం పెట్టారు. ప్రజ్వల్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ తో ఆయన్ను సైతం పార్లమెంట్ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే ఆలోచనలో దేవెగౌడ ఉన్నారు.

More Telugu News