తెలుగమ్మాయికి అరుదైన అవకాశం... గ్రీస్ లో ప్రదర్శన ఇవ్వనున్న అచ్యుత మానస!

03-07-2018 Tue 10:38
  • కూచిపూడి కళాకారిణిగా రాణిస్తున్న అచ్యుత మానస
  • 8 వరకూ ఏథెన్స్ లో వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డ్యాన్స్ రీసెర్చ్
  • ఇండియా తరఫున హాజరు కానున్న మానస
హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవిచంద్ర కుమార్తె, కూచిపూడి నృత్య కళాకారిణిగా రాణిస్తున్న అచ్యుత మానసకు అరుదైన అవకాశం లభించింది. రేపటి నుంచి 8వ తేదీ వరకూ గ్రీస్ లోని ఏథెన్స్ లో జరిగే 51వ 'వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డ్యాన్స్ రీసెర్చ్'లో ఇండియా తరఫున హాజరయ్యే ఇద్దరిలో ఈమె ఒకరు.

భరతనాట్యంతో పాటు మణిపురి, ఒడిస్సీ, కథక్ తదితర నృత్య రీతుల్లో ప్రావీణ్యం పొందిన మానస, నృత్యం చేస్తూ బొమ్మలు వేయడంలోనూ దిట్టే. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో తన పర్యటన వివరాలు తెలిపిన ఆమె, ఏపీ ప్రభుత్వ స్పాన్సర్ షిప్ తో తాను గ్రీస్ కు వెళుతున్నానని, తనతో పాటు మరో కథక్ నృత్య కళాకారిణి మాత్రమే ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి ఎంపికైందని తెలిపారు. స్టేట్ హోమ్ లో ఆశ్రయం పొందుతున్న అనాధ చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నానని తెలిపారు. 6వ తేదీన ఏథెన్స్ లోని దోరా స్ట్రాటో థియేటర్ లో తన ప్రదర్శన ఉంటుందని తెలిపారు.