Bihar: నితీశ్ కుమార్‌కు తలుపులు మూసేశాం.. రబ్రీ ఇంటి ముందు ‘నో ఎంట్రీ’ బోర్డు పెడుతున్నాం: తేజ్ ప్రతాప్ యాదవ్

  • బీజేపీతో నితీశ్‌కు దెబ్బతిన్న సంబంధాలు?
  • తిరిగి మహాకూటమివైపు చూపు
  • దారులు మూసేశామన్న లాలు కుమారులు

మహా కూటమిలోకి వచ్చేందుకు  బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు దారులు మూసివేశామని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తేల్చి చెప్పారు. తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఇంటి బయట ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలకు జేడీయూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ దీటుగా స్పందించారు. ఆ ఇంటిపై తరచూ సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తున్నారని, అలాంటి ఇంటిలోకి వెళ్లాలని ఎవరూ కోరుకోరని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ నేతలు వాడుతున్న భాష వారి విలువలను బయటపెడుతోందని విమర్శించారు. లాలు కుటుంబం మొత్తం అవినీతి ఆరోపణల్లో చిక్కుకుందని ఆరోపించారు.

బీజేపీతో నితీశ్ కుమార్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయని, ఆయన తిరిగి మహాకూటమితో జతకట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం లాలు ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ నితిశ్ కుమార్‌కు దారులు మూసేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వీ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. తాజాగా తేజ్ ప్రతాప్ కూడా అవే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News