paripoorna: దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను.. కత్తి మహేశ్‌కి కచ్చితంగా శిక్షపడేలా రోడ్డెక్కుతాం: స్వామి పరిపూర్ణానంద

  • శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌
  • రేపటిలోగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలి
  • ఇటువంటి వారికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇవ్వాలి
  • మేమేం చేతులు ముడుచుకుని కూర్చోం

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో హిందూ జనశక్తి నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్లపై కొందరు చేస్తోన్న అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రీయ హిందూ సేన అధ్యక్షుడు స్వామి పరిపూర్ణానంద స్పందిస్తూ, ఇక తాము ఊరుకోబోమని తీవ్ర హెచ్చరిక చేశారు.

"ఈ భారత దేశంలో వాడు ఎవ్వడైనా సరే.. మతాన్ని, ప్రజల విశ్వాసాలని విమర్శిస్తోన్న వారికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇవ్వాలి. ఈ భారత్‌లో అన్ని మతాల వారు బతుకుతున్నారు.. తల్లిదండ్రులు చేసుకున్న పాపమేమో ఇటువంటి వారు వారి కడుపులో పుడుతున్నారు. అతడికి కచ్చితంగా శిక్ష పడేలా ముందుకు వెళతాం.

రాముడిని కోట్ల మంది ఆరాధిస్తున్నారు. అందరి మనస్సుని ఆయన గాయపర్చారు. ఇది సముచితమా? సమంజసమా? టీవీ ఛానెళ్లు ఆయనను వాడుకుంటున్నాయా? ఆయన ఛానెళ్లను వాడుకుంటున్నారా? ఇటువంటి వారిని మనం ఇంకా క్షమిస్తూ పోతే సమాజంలో దుష్పరిణామాలకు ఇది దారి తీస్తుంది. అనుచిత ట్వీట్లు కూడా చేస్తూ మరింత సంచలనం చేస్తానని అంటున్నాడు.

దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను.. కత్తి మహేశ్ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోతే.. ఆయా ప్రభుత్వాలు విపరీత పరిణామాలు ఎదుర్కోక తప్పదు.. మృగంలా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే మేము చాలా దూరానికి వెళ్లాల్సి వస్తుంది.. మేము వెనకడుగు వేసేది లేదు.. రేపటిలోగా ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే రోడ్డెక్కుతాం.. మేమేం చేతులు ముడుచుకుని కూర్చోం" అని హెచ్చరించారు. 

More Telugu News