Guntur: గుంటూరు జిల్లాలో దారుణం... ప్రియురాలిపై అత్యాచారం చేస్తుంటే పారిపోయిన ప్రియుడు!

  • కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వని ప్రియుడు జోసఫ్
  • నర్సుపై రాత్రంతా ఇద్దరు దుర్మార్గుల దాష్టీకం
  • విషయం తెలుసుకుని దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పెదవడ్లపూడిలో దారుణం జరిగింది. ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు, తన విధులు ముగించుకుని ప్రియుడితో కలసి వాహనంపై వెళుతుండగా, వెనకాలే వచ్చిన ఇద్దరు తాగుబోతులు, తాము పోలీసులమని చెబుతూ ప్రియుడిని కొట్టి, ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడగా, ప్రియుడు పారిపోయాడు. విషయాన్ని కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి జరుగగా, ఆదివారం పోలీసుల దృష్టికి వచ్చింది.

బాధితురాలి నుంచి పోలీసులు సేకరించిన వివరాల మేరకు, తన స్నేహితురాలి ద్వారా పరిచయమైన జోసఫ్ తంబి అనే యువకుడిని ఆమె కొంతకాలంగా ప్రేమిస్తోంది. కాకాని రోడ్డులోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో విధులను ముగించుకుని, జోసఫ్ తో కలసి బైక్ పై ఇంటికి బయలుదేరింది. పెదవడ్లపూడి సమీపంలో అడ్డుకున్న వ్యక్తులు, జోసఫ్ ను కొట్టి, బెదిరించి పంపించి వేసి నర్సుపై అత్యాచారం చేశారు. రాత్రంతా ఆమె పొలాల మధ్యే పడివుంది. తెల్లారిన తరువాత స్థానికులు గమనించి ఆమె బంధువులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన జోసఫ్ కోసం, ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News