Singapore: మరో మారు సింగపూర్ కు చంద్రబాబునాయుడు!

  • 8 నుంచి సింగపూర్ లో వరల్డ్ సిటీస్ సమ్మిట్
  • పాల్గొననున్న చంద్రబాబు
  • మంత్రులు యనమల, నారాయణ కూడా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈనెల 8 నుంచి సింగపూర్ లో జరిగే డబ్ల్యూసీఎస్ (వరల్డ్ సిటీస్ సమ్మిట్)లో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు వెంట సీఆర్డీయే, ఏడీసీ, ఈడీబీ అధికారుల బృందం కూడా సింగపూర్ వెళ్లనుంది.

ఇక్కడ జరిగే సదస్సు సందర్భంగా సీఆర్డీయే పెవీలియన్ ను ఏర్పాటు చేయనుండగా, తన ప్రసంగంలో రాజధాని అమరావతి గురించి చంద్రబాబు మాట్లాడనున్నారు. 8వ తేదీ నుంచి 5 రోజుల పాటు సదస్సు సాగనుండగా, రెండు రోజుల పాటు చంద్రబాబు సింగపూర్ లో ఉంటారు. సదస్సు ప్రారంభం సందర్భంగా జరిగే ప్రపంచ మేయర్ల ఫోరంను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

అధునాతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించి నగరాల సమీకృతాభివృద్ధి, మౌలిక వసతుల కోసం నిధులను సమకూర్చుకునే వ్యూహాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి అవగాహన ఉండాలన్న అంశాలపై చంద్రబాబు ప్రసంగం సాగనుందని సమాచారం, ఆ తరువాత సాయంత్రం మేయర్లు, సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు సింగపూర్ ఇచ్చే విందులో పాల్గొని, వివిధ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మరుసటి రోజు... 9వ తేదీ జాయింట్ ఓపెనింగ్ ప్లీనరీ జరగనుండగా, దానిలోనూ సీఎం ప్రసంగిస్తారు. కాగా, సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, మునిసిపల్ మంత్రి నారాయణ తదితరులు వెళ్లనున్నారు.

More Telugu News