Pakistan: నవాజ్ షరీఫ్ కు మరో దెబ్బ.. 'పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్' పేరు నుంచి ‘ఎన్’ అవుట్?

  • ‌పనామా పేపర్ల కుంభకోణంలో షరీఫ్‌పై అనర్హత వేటు
  • పార్టీ పేరులోని ‘ఎన్’ను తొలగించాలంటూ ఈసీకి ఫిర్యాదు
  • వచ్చే నెల 9న హాజరు కావాలంటూ ఈసీ ఆదేశం

పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకుని ప్రధాని పదవిని కోల్పోయిన నవాజ్ షరీఫ్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తన సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధ్యక్ష పదవిని ఇప్పటికే కోల్పోయిన నవాజ్ ఇప్పుడు పా‌ర్టీ పేరులోనే ‘ఎన్’ను కోల్పోయే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన వ్యక్తి పేరుపై రాజకీయ పార్టీ ఉండడం సరికాదం‌టూ అవామీ తెహ్రీక్ నేత ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఆగస్టు 9న తమ ఎదుట హాజరు కావాలంటూ షరీఫ్‌కు నోటీసులు పంపింది. వచ్చే నెల 25న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ నోటీసులు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి అనర్హత వేటు పడిన తర్వాత కూడా షరీఫ్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేలా పీఎంఎల్ ఎన్ సవరణ చేపట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు కూడా అనర్హత వేటు పడిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. తాజాగా, ఇప్పుడు పార్టీలోని ‘ఎన్’ పదాన్ని తొలగించాలంటూ అవామీ తెహ్రీక్ నేత ఈసీని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News