Donald Trump: ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్... ఆటపట్టించిన కమేడియన్!

  • సెనేటర్ మాట్లాడతారంటూ వైట్ హౌస్ కు ఫోన్
  • వెంటనే ట్రంప్ కు కనెక్ట్ చేసిన సిబ్బంది
  • ప్రొటోకాల్ నిర్వహణపై అనుమానాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... అది కూడా ప్రపంచంలోనే అత్యంత భద్రతా ప్రమాణాలతో ఉండే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడాడమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ, హాలీవుడ్ కి చెందిన ఓ కమేడియన్ మాత్రం దీనిని సాధ్యం చేసి, ఎయిర్ ఫోర్స్ వన్ లో ఉన్న ట్రంప్ ను ఆటపట్టించాడు. తాను న్యూజెర్సీ సెనేటర్ రాబర్ట్ మెనాండెజ్ నంటూ పరిచయం చేసుకుని ఓ ఆట ఆడుకున్నాడు. దేశంలో అమలవుతున్న వలస విధానం నుంచి సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆంటోనీ కెన్నడీ పదవీ విరమణ తరువాత ఎవరు నియమితులవుతారంటూ... ఎన్నో విషయాలపై మాట్లాడాడు.

ట్రంప్ ఎయిర్ ఫోర్స్ లో ప్రయాణిస్తున్న వేళ, హాస్యనటుడు జాన్ మెలెండెజ్ వైట్ హౌస్ కు ఫోన్ చేసి, తాను సెనేటర్ రాబర్ట్ మెనాండెజ్ సహాయకుడినని, అత్యవసరంగా ట్రంప్ తో మాట్లాడాలని కోరడంతో వారు వెంటనే ట్రంప్ ను కాంటాక్ట్ చేశారు. కాగా, ఈ ఘటనతో అధ్యక్షుడి ప్రొటోకాల్ నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుండగా, గతంలో సెనేటర్ రాబర్ట్ మెనాండెజ్, ఓ కేసులో ఇరుక్కుని ఆపై నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న ట్రంప్, "మీరు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారన్న సంగతి నాకు తెలుసు" అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ట్రంప్ తో తన సంభాషణ రికార్డును "ది స్టట్టరింగ్‌ జాన్‌ పాడ్‌కాస్ట్‌" అనే టైటిల్ తో జాన్ మెలెండెజ్ పోస్టు చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

More Telugu News