మీరు అంత క్యూట్‌గా ఎందుకు ఉన్నారు?.. హీరోయిన్‌ని ప్రశ్నించిన అభిమాని!

30-06-2018 Sat 19:55
  • నెటిజన్ల ప్రశ్నలకు అదితి రావు హైదరి సమాధానాలు
  • పాటలు పాడటం, నటించడం, డ్యాన్స్‌ చేయడమంటే ఇష్టం
  • ‘సమ్మోహనం’ విజయం కావడంతో థ్రిల్ అయ్యాను
  • మన అందం కళ్లలో దాగి ఉంటుంది
కొత్తమ్మాయి అదితి రావు హైదరి నటించిన చిత్రం ‘సమ్మోహనం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. యువ కథానాయకుడు సుధీర్‌బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో  అదితి రావు హైదరి నటకు మంచి మార్కులు పడుతున్నాయి. తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ముచ్చటించింది. మీ తొలి తెలుగు సినిమా ‘సమ్మోహనం’ పెద్ద విజయం అందుకోవడం ఎలా అనిపించిందని ఓ నెటిజన్‌ అడగగా.. థ్రిల్ అయ్యానని, చాలా ఇష్టంతో ఈ సినిమాలో నటించానని ఆమె తెలిపింది.

మీరు అంత క్యూట్‌గా ఎందుకు ఉన్నారని ఓ అభిమాని అడగగా 'అది నా తల్లిదండ్రుల తప్పు' అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీని పెట్టింది. తనకు ఇంగ్లిషు, హిందీ భాషలు వచ్చని తెలుగు, తమిళం కాస్త వచ్చని తెలిపింది. మీరు చేసే క్రేజీ పని ఏంటి? అని ఒకరు అడగగా 'ఎవరూ చూడలేని విధంగా డ్యాన్స్‌ చేయడం' అని సమాధానమిచ్చింది.

కాగా, ఇటీవల తాను కొన్ని సినిమాలు చూశానని.. ‘హలో’ స్వీట్‌ సినిమా అని, ‘పెళ్లి చూపులు’ మంచి మూవీ అని, ‘ఫిదా’ కూడా మంచి సినిమా అని పేర్కొంది. మీ హాబీలు ఏమిటి? అని ఒకరు అడగగా పాటలు పాడటం, నటించడం, డ్యాన్స్‌ చేయడమని చెప్పింది. మీ అందం రహస్యం? ఏంటని ఒక నెటిజన్‌ ప్రశ్నించగా, మన అందం కళ్లలో దాగి ఉంటుందని సదరు హీరోయిన్ సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు మీకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారు? అని ఒకరు అడగగా నవ్వుతోన్న ఎమోజీలు పోస్ట్‌ చేసింది.