nikha halal: ముస్లింలలో ‘నిఖా హలాల’ ఆచారానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించనున్న కేంద్రం!

  • లింగపరమైన న్యాయసూత్రాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం
  • ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు
  • విచారించనున్న రాజ్యాంగ ధర్మాసనం

ముస్లిం సమాజంలో ఉన్న ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని ఆమధ్య సుప్రీంకోర్టు చట్ట విరుద్ధమంటూ తీర్పు చెప్పిన నేపథ్యంలో, ఇప్పుడు ముస్లింలలోనే ఉన్న మరో వివాదాస్పద ఆచారం ‘నిఖా హలాల’ రద్దు దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. ఈ ఆచారానికి ఉన్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగం కావాలనుకుంటోందన్నది తాజా సమాచారం. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సంస్థ నిఖా హలాలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.

నిఖా హలాల అంటే ఇస్లాంలో వివాహాన్ని అనుమతించడం అని. ఈ ఆచారంలో ఓ పురుషుడు ఒకే మహిళకు విడాకులు ఇచ్చి రెండు పర్యాయాలు వివాహం చేసుకోవచ్చు. మళ్లీ బంధాన్ని తెంచుకుంటే, మూడో సారి వివాహం చేసుకునేందుకు షరతులు వున్నాయి. సదరు మహిళ మరొకరిని వివాహం చేసుకుని వితంతువుగా మారి ఉండాలి. లేదా ఆమె విడాకులు తీసుకుని అయినా ఉండాలి. అప్పుడే ఆ మహిళను సంబంధిత వ్యక్తి మూడో సారి భార్యగా స్వీకరించొచ్చు. ఈ ఆచారం లింగపరమైన న్యాయసూత్రాలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

More Telugu News