Meena Jewellers: రూ. 6 కోట్లు చిట్టీల సొమ్ము మింగేసిన కేసులో.. మీనా జ్యూవెల్లర్స్ యజమాని అరెస్ట్

  • చిట్టీల సొమ్మును స్వాహా చేసిన ఉమేష్ పురుషోత్తమ్
  • చెల్లని చెక్కులు ఇచ్చి మోసం
  • కావాలనే ఎగ్గొడుతున్నాడని తేల్చిన పోలీసులు

రూ. 6 కోట్ల చిట్టీల సొమ్మును స్వాహా చేసిన కేసులో ప్రముఖ వజ్రాభరణాల సంస్థ మీనా జ్యూవెల్లర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్‌ పురుషోత్తమ్‌ జెత్వానీని హైదరాబాద్ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. చిట్టీలు వేస్తూ, వాటిని ముందుగానే పాడి, రూ. 6 కోట్లు తీసుకుని కిస్తీలు కట్టడం లేదంటూ, శుభాంజలి చిట్స్‌ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక విచారణలో ఉమేష్‌ పురుషోత్తమ్‌ ఉద్దేశపూర్వకంగానే డబ్బులు ఎగ్గొడుతున్నారని గుర్తించి, అరెస్ట్ చేశారు.

అతని కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్ చేశామని, శుభాంజలి చిట్స్‌ లో నాలుగేళ్ల కిందట ఉమేష్‌ సభ్యుడిగా చేరి, ఏడాది వ్యవధిలోనే రూ. కోటి విలువైన ఐదు చిట్టీలు, రూ. 50 లక్షల విలువైన రెండు చిట్టీల్లో చేరి, ఆ వెంటనే వాటిని పాడుకున్నాడని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఆపై నెలసరి వాయిదాలను ఎగ్గొట్టారని, చిట్ ఫండ్ సంస్థ ప్రతినిధులు నిలదీయగా, చెల్లని చెక్కులు ఇచ్చారని తెలిపారు. అరెస్ట్ చేసిన పురుషోత్తమ్ ను కోర్టు ముందు హాజరు పరుస్తామని, కేసును విచారిస్తున్నామని వెల్లడించారు.

More Telugu News