ఏడాది తర్వాత స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు

29-06-2018 Fri 13:41
  • ఈ రోజు వాయు నాణ్యత సూచీ 83గా నమోదు
  • ఇది సంతృప్తికర స్థాయి
  • గతేడాది ఆగస్ట్ తర్వాత ఈ స్థాయికి చేరుకున్నది ఈ వారంలోనే
ఢిల్లీ ప్రజలు ఈ వారంలో కాస్త స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చగలిగారు. ఏడాదిలో మొదటి సారిగా గాలి స్వచ్ఛత సంతృప్తికరమైన స్థాయికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో గత సోమవారం ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసింది. గురువారం భారీ వర్షం పడింది. దీంతో ఢిల్లీ చల్లబడడమే కాకుండా గాలిలోని కాలుష్యం తగ్గుముఖం పట్టింది.

వాయు నాణ్యత సూచీ 83 పాయింట్లతో సంతృప్తికర స్థాయిలో ఈ రోజు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈ బుధవారం కూడా సూచీ ఈ స్థాయిని చేరినట్టు పేర్కొన్నారు. గతేడాది ఆగస్ట్ లో ఢిల్లీ వాసులు స్వచ్ఛమైన గాలిని పీల్చారు. ఆ తర్వాత తిరిగి ఈ వారంలోనే వాయు నాణ్యత సంతృప్తికర స్థాయిని చేరుకుంది. వాయు నాణ్యత 0-50 మధ్య ఉంటే మంచిగాను, 51-100 మధ్య ఉంటే సంతృప్తికరంగాను, 101-200 మధ్య ఉంటే మోస్తరుగాను, 201-300 మధ్య ఉంటే బలహీనంగాను ఉన్నట్టు పరిగణిస్తారు.