మంచిర్యాల పిలగాడు చెప్పేదాకా నాక్కూడా తెలియదు: కేసీఆర్

29-06-2018 Fri 08:31
  • తెలంగాణలో ఎన్నో ప్రకృతి అందాలు
  • సమైక్య పాలకుల వైఖరితో వెలుగులోకి రాలేదన్న కేసీఆర్
  • ప్రపంచస్థాయికి పర్యాటకాన్ని తీసుకెళ్తామని వెల్లడి
"మంచిర్యాల పిలగాడు దూలం సత్యనారాయణ వచ్చి వీడియో తీసి చూపించే వరకూ తెలంగాణలో దాగివున్న ప్రకృతి అందాలు వెలుగులోకి రాలేదు" అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రకృతి రమణీయ దృశ్యాలతోపాటు అద్భుత పుణ్యక్షేత్రాలు ఎన్నో తెలంగాణలో మరుగున పడ్డాయని పేర్కొన్న ఆయన, రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని అన్నారు.

కామారెడ్డి ట్యాంక్ బండ్ సుందరీకరణపై జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, విశాలమైన అడవులు, కొండలు, నదులు, చెరువులు, సుందర దృశ్యాలతో నిండిన రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సమీప భవిష్యత్తులో చెరువులను అభివృద్ధి చేసి, ఆయకట్టును పెంచుతామని, వ్యవసాయాన్ని స్థిరీకరించి అనుబంధ వృత్తులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.,