TRS: డీఎస్ టీఆర్ఎస్‌ను వీడడానికి కారణం అదేనా?

  • కవితకు వ్యతిరేకంగా డీఎస్ కుమారుడి ప్రచారం
  • మండిపడిన ఎంపీ
  • డీఎస్‌పై చర్యల కోసం కవిత లేఖ
  • పదవి ఇచ్చినా పట్టించుకోని పార్టీ
  • పార్టీలో గౌరవం లేదని మనస్తాపం

ప్రస్తుతం తెలంగాణలో డి.శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్‌ను డీఎస్ వీడడానికి బలమైన కారణం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనకు రాజ్యసభ సీటు ఇచ్చినా తర్వాత తనను పట్టించుకోలేదన్నది అందులో ఒక కారణం కాగా, సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత రెండో కారణంగా తెలుస్తోంది. కవితకు వ్యతిరేకంగా డీఎస్ తనయుడు అరవింద్ ప్రచారానికి పూనుకున్నారని, దీంతో ఆమె ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో డీఎస్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె నేతృత్వంలోని ప్రజాప్రతినిధులు లేఖ రాశారు.

నిజామాబాద్ పార్లమెంటు స్థానంతోపాటు జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని డీఎస్ పలుమార్లు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు ఆయన సన్నిహితుడు భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం డీఎస్‌కు మింగుడు పడలేదు. నిజానికి ఆయన అప్పుడే పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

టీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్న ఆయన ఢిల్లీలో తొలుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తన బాధను బయటపెట్టారు. పార్టీని తాను ఎందుకు వీడిందీ వివరించడంతోపాటు క్షమాపణలు కూడా వేడుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైందని, త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

More Telugu News