Donald Trump: 100 శాతం సుంకాలా?: ఇండియాపై విరుచుకుపడ్డ ట్రంప్!

  • వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం
  • అన్ని దేశాలూ సుంకాలను తొలగించేలా తన ప్రయత్నం తాను చేశానన్న ట్రంప్
  • కుదరలేదు కాబట్టే వాణిజ్య సమతుల్యత కోసం పన్నులు పెంచానని వెల్లడి
  • చైనా వల్ల గతేడాది 500 బిలియన్ డాలర్లు నష్టపోయామని వ్యాఖ్య

అమెరికాలో తయారై ఇండియాకు దిగుమతి అయ్యే ప్రొడక్టులపై 100 శాతం పన్నులను విధించడాన్ని డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. వచ్చే వారంలో ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ మాట్లాడారు. వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, "ఉదాహరణకు ఇండియాను తీసుకోండి. వారు మన ఉత్పత్తులపై 100 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఈ పన్నులను తొలగించాలని మేము కోరుతున్నాం" అని అన్నారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ట్రంప్ పన్నుల భారాన్ని పెంచడం మొదలు పెట్టిన తరువాత, పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికా తన వాణిజ్య సమతుల్యతను కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తోందని, దాన్ని సాకుగా చూపుతూ పలు దేశాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా యూరప్ దేశాలతో పాటు చైనా, ఇండియాలు అమెరికన్ ఉత్పత్తులపై భారీగా పెంచిన పన్నులను వెనక్కు తీసుకోవాలని కోరారు. "జీ-7 దేశాల సమావేశంలో నేను చెప్పిన మాటలు గుర్తున్నాయా? అన్ని రకాల సుంకాలను తొలగించి సరిహద్దులు చెరిపేద్దామని నేను సలహా ఇచ్చాను. అందరికీ అంగీకారమేనా? అని అడిగాను. ఎవ్వరూ అంగీకారం తెలపలేదు. అందువల్లే నా నిర్ణయాన్ని నేను తీసుకున్నాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇతర దేశాల వస్తువులపై సుంకాలను తొలగించి, ఆయా దేశాల్లో అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలను తొలగించేలా చూడాలన్న తన ఆలోచన నెరవేరలేదని వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఓ బ్యాంకు వంటిదని, ప్రతి ఒక్కరూ బ్యాంకును లూటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన, గత సంవత్సరం చైనాతో వాణిజ్యంతో 500 బిలియన్ డాలర్లను, యూరోపియన్ యూనియన్ తో వాణిజ్యంలో 151 బిలియన్ డాలర్లను నష్టపోయామని ట్రంప్ తెలిపారు.

కాగా, వచ్చే వారంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాకు వెళ్లి మైక్ పాంపియో, జేమ్స్ టాటిస్ లతో చర్చించనున్నారు. 

More Telugu News