D Srinivas: డీఎస్ ఉన్నా.. లేకున్నా ఒకటే!: ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు

  • డీఎస్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తీర్మానం
  • తీర్మానాన్ని కేసీఆర్ కు పంపించామన్న కవిత
  • ఆయన వల్ల కాస్త కూడా ప్రయోజనం లేదని విమర్శలు

టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ పై నిజామాబాద్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల పార్టీకి జరిగిన ఉపయోగం ఏమీ లేదని, ఆయన ఉన్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నుంచి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతల సమావేశం జరుగగా, సమావేశం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. వెంటనే ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జిల్లా కమిటీ తీర్మానించిందని, ఈ తీర్మానాన్ని అధ్యక్షుడు కేసీఆర్ కు ఇప్పటికే పంపించామని కవిత తెలిపారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలకు కూడా సిఫార్సు చేశామని చెప్పారు.

 ఆయన పార్టీలో చేరిన తరువాత ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె అన్నారు. ఆయన పనులతో పార్టీకి నష్టం వాటిల్లిందని, తన ఉనికిని చాటుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు నష్టం కలిగిందని అన్నారు. పార్టీలో వర్గాలను పెంచి పోషించారని, మిగతా నేతలంతా ఏకతాటిపై ఉంటే, ఈయనొక్కరే మరో దారిలో వెళుతున్నారని ఆరోపించారు. కాగా, డీఎస్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతారన్న అనుమానాలు పెరగడంతోనే ఆయనపై వేటు వేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News