Nara Lokesh: ఫ్లెక్స్‌ ట్రానిక్స్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. తిరుపతిలో యూనిట్ ఏర్పాటు!

  • ఫ్లెక్స్‌ ట్రానిక్స్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
  • తిరుపతిలో రూ.585 కోట్లతో యూనిట్ ఏర్పాటు
  • ఆగస్టు 15న యూనిట్ ప్రారంభం
  • 6,600 మందికి ఉపాధి

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతున్న ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రపంచంలోని ఐదు పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో మూడో స్థానంలో ఉన్న ఫ్లెక్స్‌ ట్రానిక్స్ కంపెనీ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేశ్ మాట్లాడారు.

ఫ్లెక్స్‌ ట్రానిక్స్ చాలా పెద్ద సంస్థ అని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. రూ.585 కోట్లతో ఆగస్టు 15వ తేదీన తిరుపతిలో ఏర్పాటు కాబోతున్న ఫ్లెక్స్‌ ట్రానిక్స్ యూనిట్ వల్ల 6,600 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్లెక్స్ ట్రానిక్స్ యూనిట్లో మొబైల్ ఫోన్లో వినియోగించే పరికరాలు తయారు చేస్తారన్నారు.

ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం మూడు నెలల నుంచి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తూ వచ్చామని, చివరికి తమ కష్టం ఫలించిందని అన్నారు. మొబైల్ తయారీలో 50 శాతం మేర ఏపీ నుంచే ఉత్పత్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆయన లక్ష్యం మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చామన్నారు.

2014లో ఏపీలో ఒక్క ఎలక్ట్రానిక్ సంస్థ కూడా లేదని, ఇప్పుడు రిలయన్స్ వంటి అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇప్పటికే సెల్ కాన్, కార్బన్, డిక్సన్ వంటి సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనే 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్ తెలిపారు.

ఫ్లెక్స్‌ ట్రానిక్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకిస్ బార్బియర్ మాట్లాడుతూ.. ఇండియాలో తమ విభాగం ఏర్పాటు కోసం అన్వేషిస్తుండగా, ఏపీ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిందన్నారు. 3 నెలల నుంచి మంత్రి లోకేశ్ తో చర్చిస్తూ వచ్చామన్నారు. ఏపీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో తమ యూనిట్ ను ఏపీలో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.

తమ సంస్థకు అనుబంధంగా ఉండే మిగిలిన సంస్థలనూ ఏపీలో ప్రారంభించేలా చూస్తున్నామన్నారు. అనంతరం ప్లెక్స్ ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయూ ఒప్పంద పత్రాలను ప్రభుత్వం తరఫున ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్, ఆ సంస్థ ప్రతినిధులు మార్పిడి చేసుకున్నారు.   

More Telugu News