gogineni: హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు!

  • బాబు గోగినేనిపై పలు ఆరోపణలు
  • 13 సెక్షన్ల కింద కేసు నమోదు
  • మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కొందరు వ్యక్తులు

ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై హైదారాబాద్ శివారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారని, మత విశ్వాసాలను కించ పరచడం, భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించేలా విదేశాల మీద విద్వేషకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కేవీ నారాయణ అనే వ్యక్తి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యూట్యూబ్ లో ఒక మతాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారని, ప్రైవేట్ కార్యక్రమానికి ఆధార్ నెంబర్ తీసుకోవడంపై హైదరాబాద్ లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బాబు గోగినేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 13 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్టు సమాచారం.

కాగా, సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ కు బాబు గోగినేని ఫౌండర్ అని, దీనికి సంబంధించిన కార్యక్రమాలు మలేషియాలో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమాలకు హాజరయ్యే సభ్యుల ఆధార్ నెంబర్లను ఆయనకు సంబంధించిన వ్యక్తులు తప్పనిసరిగా తీసుకుంటారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తీసుకున్న ఆధార్ నెంబర్లను బాబు గోగినేని, అతని అనుచరులు తమ సంస్థల ద్వారా విదేశాలకు అందజేస్తున్నారని, ఇలా చేయడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్టణంలో బాబు గోగినేని ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమాల్లో ఆధార్ నెంబర్లు తీసుకున్న విషయాన్ని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.

More Telugu News