amarnath yatra: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు... 28 నుంచి యాత్ర మొదలు

  • భద్రతా విధుల్లో 40,000 మంది
  • ప్రతీ వాహనానికి ఆర్ఎఫ్ ట్యాగ్
  • ఈ ఏడాది యాత్రకు 1.5 లక్షల మంది పేర్ల నమోదు

వార్షిక అమర్ నాథ్ యాత్ర వచ్చే గురువారం ప్రారంభం కానుంది. 60 రోజుల పాటు జరిగే యాత్రకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్ బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. సీఆర్పీఎఫ్ ప్రత్యేకంగా మోటార్ సైకిల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసింది. ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడేందుకు వీలుగా మోటారు సైకిళ్లపై, ఎక్విప్ మెంట్ తో జవాన్లు చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించారు. మోటారు సైకిళ్లే అంబులెన్స్ లు మాదిరిగా పనిచేయనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణుల్లో అమర్ నాథ్ గుహ వరకు  భక్తులు చాలా దూరం కాలిబాటన వెళ్లాల్సి ఉంటుంది.  ఉగ్రవాదులు దాడులకు పాల్పడకుండా బలగాలు భక్తులకు రక్షణగా నిలుస్తాయి. భద్రతా ఏర్పాట్లపై జమ్మూ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ అభయ్ వీర్ చౌహాన్ ఈ రోజు అధికారులతో సమీక్షించనున్నారు.

ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భక్తులను తీసుకెళ్లే ప్రతీ వాహనానికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించాలని, జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, పారా మిలటరీ దళాల మధ్య సమన్వయం కోసం ఓ  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. యాత్రా మార్గంలో వివిధ బలగాలన్నీ కలసి 40,000 మంది రక్షణ విధుల్లో పాలు పంచుకోనున్నారు.  సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్స్, తక్షణం ప్రతిస్పందించే బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. గతేడాది 2.60లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1.5 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

More Telugu News