yogi adityanath: రామ మందిరానికి అడుగులు పడుతున్నాయ్.. 2019 ఎన్నికల కంటే ముందే మందిర నిర్మాణం: పీఠాధిపతులతో యోగి ఆదిత్యనాథ్

  • ఇంత కాలం సహనంతో ఉన్నారు.. మరికొంత కాలం ఓర్పు వహించండి
  • కొందరు పీఠాధిపతులు అపనమ్మకంతో ఉన్నారు
  • రాముడి అనుగ్రహంతో మందిర నిర్మాణం జరుగుతుంది

రానున్న లోక్ సభ ఎన్నికల లోపలే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ పూర్తి చేయాలనుకుంటోందా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు వింటే నిజమనే అనిపిస్తోంది. సంత్ సమ్మేళన్ (పీఠాధిపతుల సమ్మేళనం) కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ, 2019 ఎన్నికలకు ముందే మందిరాన్ని నిర్మిస్తామని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, సహనంతో ఉండాలని తెలిపారు.

రామ మందిరం గురించి మరో బీజేపీ నేత రామ్ విలాస్ వేదాంతి వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే యోగి ఇదే అంశంపై స్పందించడం గమనార్హం. వేదాంతి మాట్లాడుతూ, "కోర్టు ఆర్డరు తీసుకుని... రామ మందిరాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ కూల్చలేదు. 1992లో బాబ్రీ మసీదును కోర్టు ఆర్డరుతో ధ్వసం చేయలేదు. మందిరం ప్రాంతంలో ఉన్నట్టుండి రాముడి విగ్రహం ఏర్పాటయినట్టే... మందిర నిర్మాణం కూడా ఏదో ఒక రోజు ఉన్నట్టుండి ప్రారంభం అవుతుంది" అని తెలిపారు.

ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది రాముడేనని... అతని అనుగ్రహంతో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని చెప్పారు. ఈ అంశంపై కొంత మంది పీఠాధిపతులు ఎందుకు అపనమ్మకంతో ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పటి వరకు అందరూ సహనంతో, ఓర్పుతో ఉన్నారని... మరి కొన్ని రోజులు సహనంతో వేచి ఉండాలని కోరారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనమంతా ఉన్నామని... మన దేశంలో న్యాయ, చట్టసభల వ్యవస్థలు తమతమ పాత్రను పోషిస్తున్నాయని... వాటి పరిధులను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

రామ మందిర నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ కూడా నిన్న మరోసారి స్పందించింది. రామ మందిరం ఉద్యమాన్ని తాము మరోసారి ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. రానున్న మూడు లేదా నాలుగు నెలల్లో రామ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించకపోతే... మత పెద్దలతో కలసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించింది. మరోవైపు, బాబ్రీ మసీదు-రామ మందిరం కేసు వాదనలను సుప్రీంకోర్టు ఈరోజు వినే అవకాశం ఉంది. 

More Telugu News