Maghar: ప్రధాని మోదీ అనూహ్య నిర్ణయం: 'నరక ద్వారం' నుంచి ఎన్నికల సమర శంఖారావం!

  • నేడు మఘర్ లో భారీ ర్యాలీ
  • మఘర్ లో మరణిస్తే నరకానికి పోతారని ప్రజల నమ్మకం
  • 15వ శతాబ్దంలో మఘర్ కు వచ్చి తుదిశ్వాస విడిచిన కబీర్
  • ఆయన సమాధికి నివాళులు అర్పించనున్న మోదీ

2014 సార్వత్రిక ఎన్నికల్లో ముక్తిని కలిగించే పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిని ఎంచుకుని, అక్కడి నుంచి కదిలి, విజయం సాధించి ప్రధాని పదవిని అలంకరించిన నరేంద్ర మోదీ, 2019 ఎన్నికలకోసం 'నరక ద్వారం'గా పేరున్న మఘర్ను ఎంచుకున్నారు. కబీర్ దాస్ మహాపరినిర్వాణం చెందిన స్థలం నుంచి వచ్చే సంవత్సరం ఎన్నికలకు శంఖారావం పూరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేడు మఘర్ లో భారీ ర్యాలీ జరగనుంది.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి సీఎం ఆదిత్యనాథ్ ఎంపీగా పనిచేసిన గోరఖ్ పూర్ కు వెళ్లే జాతీయ రహదారిపై మఘర్ ఉంది. నేడు మఘర్ కు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ, కబీర్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. వారణాసిలో జన్మించిన కబీర్ దాస్ 120 సంవత్సరాల తరువాత మఘర్ లో మరణించగా, ఆయన 620వ జయంత్యుత్సవాలను, 500వ వర్థంతిని ఘనంగా జరపాలని మోదీ ఇప్పటికే నిర్ణయించారు. తన పర్యటనలో భాగంగా మోదీ కబీర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు శంకుస్థాపన చేయనున్నారు.

కాగా, 15వ శతాబ్దంలో జన్మించిన కబీర్, మఘర్ లో మరణిస్తే నరకానికి వెళతారన్న నమ్మకాలు ప్రజల్లో ఉన్నప్పటికీ, ఆయన అక్కడే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. "వారణాసి అయినా, మఘర్ భూమి అయినా నాకు ఒక్కటే. నా మనసులో రాముడు ఉన్నాడు. నేను వారణాసిలో మరణించి ముక్తిని పొందినట్లయితే, రాముడిని ఆరాధించడం వల్ల నాకు కలిగిన లాభమేంటి?" అని ప్రశ్నిస్తూ, కబీర్ మఘర్ లో తుది శ్వాస విడిచారు.

ఇదిలావుండగా, మోదీ పర్యటనపై స్పందించిన సంత్ కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠి, ఈ పర్యటన కబీర్ 500వ వర్థంతి సందర్భంగా జరుగుతుండటం యాదృచ్చకమేనని, కబీర్ కూడా 'సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్' నినాదాన్ని ప్రచారం చేశారని, మోదీ కూడా ఇప్పుడదే చేస్తున్నారని అన్నారు. ఎంతో కాలం పాటు వెనుకబడిపోయిన మఘర్ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు.

More Telugu News