Army Mazor: ఆర్మీ మేజర్ కు, హతురాలికి మధ్య 6 నెలల్లో 3,500 ఫోన్ కాల్స్!

  • సహ మేజర్ భార్యపై కన్నేసిన మేజర్ నిఖిల్ హండా
  • పెళ్లికి అంగీకరించలేదని దారుణ హత్య
  • కారులో రక్తపు మరకలు, శైలజ తల వెంట్రుకలు లభ్యం

భారత సైనిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఆర్మీ మేజర్ నిఖిల్ హండా చేసిన హత్య కేసు వెనుక మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో అందంగా ఉండే ఇంకో మేజర్ భార్య శైలజా ద్వివేదిపై కన్నేసిన నిఖిల్ హండా, ఆమె తనతో పెళ్లికి అంగీకరించ లేదన్న ఆగ్రహంతో గొంతు కోసి, ఆపై వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హండాను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఆయన్ను విచారిస్తున్నారు.

ఇక, ఈ సంవత్సరం జనవరి నుంచి ఆమె హత్య జరిగిన ముందు రోజు వరకూ ఇద్దరి మధ్యా 3,500 ఫోన్ కాల్స్, మెసేజ్ లు రికార్డు అయ్యాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్యకు ముందు వారిద్దరూ కారులో బయలుదేరారని, కారులో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని, ఆ క్రమంలోనే కారులో గొంతు కోసిన నిఖిల్, ఆపై అమెను రోడ్డుపై పడేసి కారు ఎక్కించాడని తెలిపాయి. అతను చేసిన కాల్స్ సంఖ్యను చూస్తుంటే, ఆమె అంటే ఎంత పిచ్చితో ఉండేవాడో తెలుస్తోందని పోలీస్ అధికారి విజయ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

హత్యకు ముందు రోజు రాత్రి శైలజ విషయంలో తన భార్యతో హండా గొడవ పడ్డాడని, ఆపై శైలజా ద్వివేదికి ఫోన్ చేసి, మాట్లాడాలని పిలిపించుకున్నాడని, హత్య తరువాత తన కారును క్లీనింగ్ చేయించుకున్నప్పటికీ, ఫోరెన్సిక్ నిపుణులు కారులో రక్తపు మరకల ఆనవాళ్లను కనుగొన్నారని విజయ్ కుమార్ తెలిపారు. కారులో శైలజ తల వెంట్రుకలు కూడా లభ్యమయ్యాయని వెల్లడించారు. హండాను మరో మూడు రోజుల పాటు విచారించనున్నట్టు తెలిపారు.

More Telugu News