Yadadri Bhuvanagiri District: కన్నీటి సంద్రమైన వేములకొండ.. ప్రమాదంలో మృతి చెందిన 15 మందికీ ఒకేసారి అంత్యక్రియలు!

  • ప్రమాదంలో మృతి చెందన 15 మంది
  • అందరికీ ఒకేసారి అంత్యక్రియలు
  • గుండెలవిసేలా రోదించిన గ్రామం

యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండలో ఆదివారం మూసీ కాల్వలోకి ట్రాక్టర్‌ బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతి చెందిన 15 మందికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. 15 మందిలో 14 మంది మహిళలు కాగా, ఒక బాలుడు ఉన్నాడు. వీరందరి మృతదేహాలను అంత్యక్రియల కోసం ఒకేసారి వీధుల్లోకి తీసుకురావడంతో గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైంది. బాధిత కుటుంబాల రోదనతో గ్రామం ప్రతిధ్వనించింది. ఇక తమ పిల్లలకు దిక్కెవరంటూ గండెలవిసేలా రోదించారు. ఊరు, వాడ ఎక్కడ చూసినా కన్నీటి వేదనే. 15 మృతదేహాలు పాడె మీద ఒక దాని వెనక ఒకటి రావడంతో గ్రామస్తులు తట్టుకోలేకపోయారు.

అసలు ఏం జరుగుతోందో, తమవారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియని చిన్నారులు అమాయకంగా చూస్తూ తమ వారికి తల కొరివి పెట్టడం అక్కడి వారి హృదయాలను పిండేసింది. కులమతాలకు అతీతంగా గ్రామం మొత్తం అంత్యక్రియలకు తరలి వచ్చింది. వచ్చిన అందరూ వారికి నివాళులు అర్పించారు. వారి జ్ఞాపకార్థం గ్రామంలో ప్రత్యేకంగా ఓ స్థూపం నిర్మించాలని నిర్ణయించారు.

కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో గ్రామం నుంచి దుబాయ్ వెళ్లిన బీసు కవిత భర్త శ్రీను, స్వరూప భర్త చంద్రశేఖర్‌లు ప్రమాద వార్త తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చి, అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక తాము ఎవరి కోసం దుబాయ్ వెళ్లాలంటూ విలపించారు.

More Telugu News