Tirumala: తిరుమల శ్రీవారి ఆభరణాల ప్రదర్శనకు ఆగమశాస్త్రం ఒప్పుకోదు: సుందరవదనా భట్టాచార్యులు

  • లాకర్లలో ఉన్న శ్రీవారి ఆభరణాలను పరిశీలించాం
  • స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి
  • రమణదీక్షితులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి

తిరుమల శ్రీవారి ఆభరణాల బహిరంగ ప్రదర్శనకు ఆగమశాస్త్రం ఒప్పుకోదని టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుడు సుందరవదనా భట్టాచార్యులు చెప్పారు. మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ పాలకమండలి ఆధ్వర్యంలో శ్రీవారి ఆభరణాలను ఈరోజు పరిశీలించారు. శ్రీవారి ఆలయంలోని రాములవారి మేడలోని లాకర్లలోని ఈ ఆభరణాల పరిశీలన అనంతరం, సుందరవదనా భట్టాచార్యులు మాట్లాడుతూ, ఆ ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని అన్నారు. ఇకనైనా రమణదీక్షితులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు.

కాగా, టీటీడీ సభ్యుడు, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, రమణదీక్షితులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన వెనుక ఎవరో ఉండి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత రమణదీక్షితులు ఇలాంటి ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు.

టీటీడీకి చెందిన మరో సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని, చిన్న గుండుసూది కూడా బయటకు పోలేదని చెప్పారు. లేనిపోని ఆరోపణలు చేసిన రమణదీక్షితులు.. తిరుమల శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News