Vijayawada: విజయవాడ దుర్గగుడి భక్తుల ఆగ్రహం.. మహిళల డార్మెటరీల్లో సీసీ కెమెరాలు!

  • వన్ టౌన్ లోని సీవీ రెడ్డి ఛారిటీస్ లో మహిళా డార్మెటరీలు
  • దుస్తులు మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందన్న మహిళా భక్తులు
  • డార్మెటరీలు దుస్తులు మార్చుకునేందుకు కాదన్న ఈవో

విజయవాడలోని దుర్గగుడి దేవస్థానం మరో వివాదంలో చిక్కుకుంది. మహిళల కోసం నిర్మించిన డార్మెటరీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. దుర్గగుడి తరపున స్థానిక వన్ టౌన్ లోని సీవీ రెడ్డి ఛారిటీస్ లో యాత్రికులకు విశ్రాంతి భవన సముదాయములు (డార్మెటరీలు) నిర్మించారు. ఉచిత డార్మెటరీలు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏసీ డార్మెటరీలు ఉన్నాయి. 

మహిళల డార్మెటరీల్లో సీసీ కెమెరాలు ఉండటంతో దుస్తులు మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందని మండిపడుతున్న భక్తులు, అక్కడి సిబ్బందిని నిలదీశారు. నిర్మాణ సమయంలో అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టే ఈ గదుల్లో కూడా ఏర్పాటు చేశారని, ప్రస్తుతం అవి పనిచేయడం లేదని, ఎటువంటి దృశ్యాలు రికార్డు చేయడం లేదని సిబ్బంది చెప్పారు. అదీగాక డార్మెటరీలు విశ్రాంతి తీసుకునేందుకు తప్ప దుస్తులు మార్చుకునేందుకు కాదని ఈవో పద్మ పేర్కొన్నారు. 

కాగా, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నప్పటికీ వాటి వద్ద లైట్లు వెలుగుతుండటంతో భక్తులకు అనుమానం రావడంతో గొడవకు దిగడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ధర్మారావు అక్కడికి వచ్చారు. మహిళల గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం ఈరోజు తమకు తెలిసిందని, ఇలా ఏర్పాటు చేయడం పొరపాటేనని అన్నారు. వాటిని తొలగిస్తామని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

More Telugu News