Kadapa District: అనూహ్య వ్యాఖ్యలు... ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో గాలికి సీఎం రమేష్ మద్దతు!

  • తొలుత సీబీఐ కేసుల నుంచి బయటపడాలి
  • ఆపై ఫ్యాక్టరీ కడితే అభ్యంతరం లేదు
  • కావాలనే ఆరోపణలు చేస్తున్న పవన్ కల్యాణ్
  • పవన్ తన వ్యాఖ్యలను నిరూపిస్తే రాజీనామా: సీఎం రమేష్

తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి బయటపడి, కడప ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తలపెడితే గాలి జనార్దన్ రెడ్డికి మద్దతిస్తానని ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, స్టీల్ ప్లాంటు ఏర్పాటై ఉంటే తాము ఇలా దీక్షలకు దిగేవాళ్లమే కాదని చెప్పారు. బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ కోసం రూ. 1,200 కోట్లు బ్యాంకు రుణం తీసుకుని రూ. 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. తొలుత ఆయన కేసుల నుంచి బయటకు రావాలని, ఆ తరువాత ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవని చెప్పారు.

ప్రజల నుంచి మద్దతు వస్తుందన్న అసూయతోనే పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని సీఎం రమేష్ విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు తగదని, తమ దీక్షకు మద్దతివ్వకుండా ఆరోపణలు ఏంటని ప్రశ్నించారు. జిందాల్ ను పవన్ ఎప్పుడు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పిన విషయాలను అప్పుడే ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసిన సీఎం రమేష్, జిందాల్ లండన్ లో ఉండటం లేదని, ఇండియాలోనే ఉంటున్నారని, ఆ విషయం కూడా తెలియని పవన్, ఆయన పేరిట తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని టీడీపీ నేతలు అడ్డుకున్నారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

More Telugu News