Tamilnadu: నన్ను అడ్డుకుంటే జైలుకే... స్టాలిన్ కు తమిళనాడు గవర్నర్ హెచ్చరిక!

  • ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేస్తున్న గవర్నర్ 
  • సమాంతర పాలన చేస్తున్నారని స్టాలిన్ ఆరోపణ
  • అడ్డుకుంటే కఠిన శిక్షలుంటాయన్న రాజ్ భవన్

తమిళనాడులో తన పర్యటనలను అడ్డుకుంటున్న విపక్ష డీఎంకే నేతలకు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలను సమీక్షించడం తన విధి అని, తన పర్యటనల్లో నిరసనలు తెలిపినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా జైలుకు వెళ్లాల్సి వుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగపరంగా గవర్నర్ కు కొన్ని విశేషాధికారాలు ఉంటాయని, వాటిని ఎవరూ అడ్డుకోకూడదని రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీసీ సెక్షన్ 124 కింద గవర్నర్ కు రక్షణ లభిస్తుందని, ఆయన్ను అడ్డుకునేందుకు చూస్తే, ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని పేర్కొంది.

కాగా, రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పందిస్తూ, ఆయన ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపుతానని బెదిరించడాన్ని ఖండించారు. గవర్నర్ స్వయంగా వెళ్లి ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేయడమంటే, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టేనని, గవర్నర్ పర్యటనల్లో నల్ల జెండాలతో నిరసనలు కొనసాగిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం నాడు గవర్నర్ నామక్కల్ లో పర్యటించగా, డీఎంకే శ్రేణులు నిరసనలు తెలిపిన వేళ, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News