Telangana: నేను ఒప్పుకోను... మీలాంటి వారుండగా ఏదీ అసాధ్యం కాదు: కేటీఆర్ తో హీరోయిన్ ఈషా రెబ్బా

  • తెలంగాణలో ప్లాస్టిక్ ను నిషేధించాలని ఈషా రెబ్బా కోరిక
  • అంత సులువు కాదంటూ... ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్న కేటీఆర్
  • సమర్థవంతమైన నేతగా రాష్ట్రాన్ని నంబర్ వన్ గా ఉంచాలన్న ఈషా

తెలంగాణలో ప్లాస్టిక్ నిషేధంపై ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్, హీరోయిన్ ఈషారెబ్బాల మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తొలుత ఈషా ఓ ట్వీట్ ను పెడుతూ, "ఎన్నో విషయాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. కానీ ప్లాస్టిక్ నిషేధిత రాష్ట్రాల్లో మాత్రం లేకపోవడం నిరాశ కలిగిస్తోంది" అని వ్యాఖ్యానిస్తూ, కేటీఆర్ ను ట్యాగ్ చేయగా, ఆయన వెంటనే స్పందించారు.

కేవలం చట్ట ప్రకారం ఓ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ప్లాస్టిక్ వాడకం ఆగదని, నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలంటే, ప్లాస్టిక్ తయారీ కంపెనీలు, అధికారులు, ప్రజలకు సమస్య తీవ్రత గురించి తెలియాల్సివుందని అన్నారు. ఓ పద్ధతి ప్రకారం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

ఇక దీనిపై స్పందిస్తూ, మరో ట్వీట్ పెట్టిన ఈషా "వెంటనే స్పందించిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు. అయితే, దీనికి నేను అంగీకరించను. మీవంటి యువ, సమర్థ నేత ఉండగా, ప్లాస్టిక్ నిషేధం అసాధ్యమని నేను అనుకోను. ప్లాస్టిక్ నిషేధం విషయంలోనూ తెలంగాణను నంబర్ వన్ గా నిలపండి" అని వ్యాఖ్యానించింది.

More Telugu News