Google: ఈ-కామర్స్ రంగంలోకి దిగుతున్న గూగుల్... అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు సవాలే!

  • భారత ఈ-కామర్స్ రంగంలోకి గూగుల్
  • దీపావళి నాటికి అమ్మకాలు ప్రారంభం
  • 1.8 కోట్ల మంది జీ-మెయిల్ యూజర్లు టార్గెట్

ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు సవాల్ విసురుతూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఆన్ లైన్ అమ్మకాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ కామర్స్ వాణిజ్యం శరవేగంగా పెరుగుతున్న ఇండియా నుంచే ఈ-కామర్స్ రంగంలోకి దిగాలన్నది గూగుల్ ఆలోచనగా తెలుస్తోంది. ఆన్ లైన్ వ్యాపార వృద్ధికి ఇండియాలో ఉన్నంత అవకాశాలు మరే దేశంలోనూ లేవన్న అంచనాకు వచ్చిన గూగుల్, దీపావళి నాటికి రంగంలోకి దిగనున్నదని తెలుస్తోంది.

ఇండియాలో ఈ-కామర్స్ వ్యాపారం ప్రస్తుతం రూ. 3,850 కోట్ల డాలర్లుగా ఉండగా, మరో రెండేళ్లలో ఇది 10 వేల కోట్ల డాలర్లకు పెరుగుతుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అమెరికాకు చెందిన వాల్ మార్ట్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేయడం ద్వారా భారత విపణిలోకి ఇప్పటికే ప్రవేశించిన సంగతి తెలిసిందే. తనకున్న ఇమేజ్ తో ఒంటరిగానే మంచి మార్కెట్ వాటాను సాధించవచ్చని గూగుల్ భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేయాలని గూగుల్ భావించింది. అయితే, ఫ్లిప్ కార్ట్ వాటా విలువను మరింత ఎక్కువగా చూపడంతోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న గూగుల్, ఇటీవల చైనా కేంద్రంగా నడుస్తున్న జేడీ డాట్ కామ్ లో 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది.

ఇక భారత ఈ-మార్కెట్ ప్రవేశం గురించి గూగుల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకపోయినా, గత సంవత్సరం కాలంగా రహస్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇండియాతో ప్రారంభించి ఆపై వర్థమాన దేశాలకు విస్తరించే ప్రయత్నాల్లో గూగుల్ ఉంది. ఇండియాలోని సుమారు 1.8 కోట్ల మంది జీ-మెయిల్ వినియోగదారులకు తొలుత చేరువకావాలన్నది గూగుల్ వ్యూహం.

More Telugu News