USA: 24 మందికి వీసా కోరిన కేసీఆర్ కార్యాలయం... నలుగురికి మాత్రం ఇస్తామన్న యూఎస్ కాన్సులేట్!

  • అమెరికా తెలంగాణ సదస్సుకు రాష్ట్రం నుంచి నలుగురే
  • మే 28 తరువాత 70 శాతం దరఖాస్తుల తిరస్కరణ
  • 4 వేల మంది ఇంటర్వ్యూకు వెళితే 1,350 మందికే వీసాలు

అమెరికాలో జరగనున్న 'అమెరికా తెలంగాణ సదస్సు'కు వెళ్లేందుకు 24 మందికి వీసాలు మంజూరు చేయాలంటూ సిఫార్సు లేఖను సీఎం కేసీఆర్ కార్యాలయం పంపించగా, అన్ని దరఖాస్తులను చూసిన యూఎస్ కాన్సులేట్ అధికారులు, నలుగురికి మాత్రమే వీసాను ఇస్తామని చెప్పి, 20 దరఖాస్తులను తిరస్కరించింది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే పేరిట హీరోయిన్లను అమెరికాకు రప్పించి, వారితో వ్యభిచారం చేయిస్తున్న బాగోతం బట్టబయలైన తరువాత తెలుగు వారి వీసా దరఖాస్తులను కాన్సులేట్ అధికారులు నిర్దయగా తిరస్కరిస్తున్నారు.

గత మేలో బీ1బీ2 దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరుకాగా, ఈ నెలలో 30 శాతం మందికే వీసాలు ఇచ్చారు. మే నెలలో 12 నుంచి 28 తేదీల మధ్య 3 వేల మందికి పైగా వీసా ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 1,950 మందికి వీసా మంజూరైంది. ఆపై మే 29 నుంచి జూన్ 22 మధ్య 4 వేల మంది వీసాలకు దరఖాస్తులు చేసుకోగా, 1,350 మందికి మాత్రమే వీసాలు ఇచ్చారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని యూఎస్ ఇమిగ్రేషన్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని కాన్సులేట్ సిబ్బంది వెల్లడించారు.

More Telugu News