బాంబుదాడి నుంచి తప్పించుకున్న జింబాబ్వే అధ్యక్షుడు

23-06-2018 Sat 20:59
  • వచ్చేనెల 30న ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మర్సన్‌ మన్నగాగ్వ
  • ఉపాధ్యక్షుడు చివాంగతో పాటు ఆయన భార్యకు గాయాలు
జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్సన్‌ మన్నగాగ్వ బాంబుదాడి నుంచి తప్పించుకున్నారు. వచ్చేనెల 30న ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ నిర్వహించిన ఎమ్మర్సన్‌ మన్నగాగ్వ లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఎమ్మర్సన్‌ ప్రసంగం ముగిసిన వెంటనే బాంబు పేలడంతో భద్రతాదళాలు ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించాయి. కాగా, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు చివాంగతో పాటు ఆయన భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సభలో పాల్గొన్న మరికొంత మందికి కూడా గాయాలయినట్లు తెలుస్తోంది.