MOBILE NUMBER PORTABILITY: మొబైల్ నంబర్ పోర్టబులిటీకి వచ్చే మార్చి తర్వాత కష్టాలే!

  • ప్రస్తుతం రెండు సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంఎన్ పీ సేవలు
  • పోర్టింగ్ చార్జీలను ఇటీవల గణనీయంగా తగ్గించడంతో వీటికి నష్టాలు
  • వీటి లైసెన్స్ కాల పరిమితి మార్చితో ముగింపు
  • దాంతో ఆ తర్వాత సేవల్ని నిలిపివేస్తామని లేఖ రాసిన సంస్థలు

మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్ పీ) ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోయింది. జియో రంగ ప్రవేశం చేయడం, మార్కెట్లో టెలికం సేవలు అందించే ఆపరేటర్లు తగ్గిపోవడం, సేవల్లో లోపాలు ఇలా దీనికి పలు కారణాలున్నాయి. దీంతో అసంతృప్తితో ఉన్న కస్టమర్లు ప్రస్తుత నంబర్ ను మార్చుకునే పనిలేకుండానే ఎంఎన్ పీ ద్వారా నెట్ వర్క్ మారిపోతున్నారు. అయితే, వచ్చే ఏడాది మార్చి తర్వాత ఇందుకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం మన దేశంలో ఎంఎన్ పీ సేవల్ని ... ‘ఎంఎన్ పీ ఇంటర్ కనెక్షన్ టెలికం సొల్యూషన్స్’, ‘సినివర్స్ టెక్నాలజీస్’ అనే రెండు ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఎంఎన్ పీ సులభంగా జరిగేలా చూస్తున్నాయి. అయితే, టెలికం శాఖ ఈ ఏడాది జనవరి నుంచి పోర్టింగ్ చార్జీలను 80 శాతం వరకు తగ్గించింది. దీంతో రోజువారీ నష్టాలను చవిచూస్తున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే తమ లైసెన్స్ కాల పరిమితి 2019 మార్చితో తీరిపోనున్న నేపథ్యంలో, అప్పటి నుంచి సేవల్ని నిలిపివేస్తామని టెలికం శాఖకు లేఖ ద్వారా తెలిపాయి. మరి దీనిపై టెలికం శాఖ ఎలా స్పందిస్తుంది, ఎంఎన్ పీ సేవలు ఇక ముందూ సాఫీగా సాగేలా ఏం చర్యలు తీసుకుంటుందన్నది త్వరలో తెలియనుంది.

More Telugu News