tg venkatesh: మా రక్తంలో సీమ పౌరుషం ఉంటే.. కేకే రక్తంలో సారాయి ఉంది: టీజీ వెంకటేష్

  • కేకే కు మెదడు మోకాల్లో ఉంది
  • పిచ్చోళ్లకు అందరూ పిచ్చోళ్లగానే కనబడతారు
  • సాయంత్రమైతే కేకే మందుకొట్టి.. కేసీఆర్ కాళ్లు పట్టుకుంటారు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి సీఎం కేసీఆర్ మద్దతు ఇవ్వాలని, లేకుంటే, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా తెలంగాణలోని ఆంధ్రులకు పిలుపు ఇవ్వాల్సి వస్తుందంటూ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు కేకే, నాయిని, కర్నె ప్రభాకర్ లు టీజీ వెంకటేష్ పై ఇప్పటికే విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలో విలేకరులతో టీజీ మాట్లాడుతూ కేకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో కేకే ఎక్కడ ఉన్నారు? కేకేకు మెదడు మోకాల్లో ఉంది. పిచ్చోళ్లకు అందరూ పిచ్చోళ్లగానే కనబడతారు. మా రక్తంలో సీమ పౌరుషం ఉంది. అదే, కేకే రక్తంలో సారాయి ఉంది. సాయంత్రమైతే కేకే మందుకొట్టి.. కేసీఆర్ కాళ్లు పట్టుకుంటారు. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కష్టపడుతున్నారు. అలాగే, తెలంగాణ కోసం  సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కష్టపడుతున్నారు. మరి, తాగుబోతు కేకే ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.

తెలంగాణ గడ్డపై నుంచే తాము సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఢిల్లీలో తాము పోరాడుతున్న తరుణంలో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు కలిసి పోరాడకపోతే ఇద్దరం దెబ్బతింటామని చెప్పిన టీజీ, మోదీ నిజాయతీకి సెల్యూల్ చేయాల్సిందే కానీ, ఆయనకు పరిపాలనా దక్షత లేదని విమర్శించారు.  

More Telugu News