jogu rammanna: ఇంటికి ఆరు మొక్కల నినాదాన్ని కచ్చితంగా అమలులో పెట్టాలి: తెలంగాణ మంత్రి జోగు రామన్న

  • నాలుగో విడత హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్
  • మొక్కలు బతికిన శాతంపై జిల్లాల వారీగా సర్వే 
  • ప్రతి విద్యా ప్రాంగణం ఒక నందనవనంలా మారాలి
  • ఆగస్టు నెలాఖరు కల్లా అటవీశాఖలో ఖాళీల భర్తీ పూర్తి

త్వరలో ప్రారంభం కానున్న నాలుగో విడత హరితహారం ఏర్పాట్లపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాలకు చెందిన సీఎఫ్‌, డీఎఫ్‌ఓ, ఎఫ్‌డీఓ, సెక్షన్ ఆఫీసర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. మూడేళ్ల పాటు హరిత హారంలో పాల్గొని విజయవంతమవడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.

అదే స్ఫూర్తితో నాలుగో విడతను కూడా సక్సెస్ చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో నర్సరీలను పరిశీలించి, తగిన ఎత్తులో ఉన్న మొక్కలే నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలపై డైరెక్టరీలు తయారుచేసి అందుబాటులో ఉంచాలని చెప్పారు. గ్రామాల వారీగా ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని, హరిత రక్షణ కమిటీలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

గత హరితహారంలో నాటిన మొక్కలు ఏ మేరకు బతికాయో తెలుసుకునేందుకు జిల్లాల వారీగా ర్యాండమ్ సర్వే చేయిస్తున్నామని, బతికిన మొక్కల శాతం పెరిగితేనే హరితహారానికి సార్థకత ఉంటుందని మంత్రి తెలిపారు. ఈసారి హరితహారాన్ని స్కూలు నుంచి, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొనేలా స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల నినాదంతో నిర్వహిస్తున్నామని, ఐదో తరగతి నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులను, ప్రాంగణాలను హరితహారంలో భాగస్వామ్యం చేయాలన్నారు.

ప్రతి విద్యా ప్రాంగణం ఒక నందనవనంలా మారాలనేది ముఖ్యమంత్రి ఆశయమని, దానిని నిజం చేసి చూపించాలని అన్నారు. వారంలో ఒకరోజు, కొన్ని గంటల పాటు విద్యార్థులు మొక్కల సంరక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖతో సమన్వయం ద్వారా ఈ పనిని సాధించాలని చెప్పారు. ఇక ఇంటికి ఆరు మొక్కలు అన్న సీఎం నినాదం కచ్చితంగా అమలులో పెట్టాలని, వారు కోరిన విధంగా పూలు, పండ్ల మొక్కలను అందించేలా చర్యలు తీసుకోవాలని జోగురామన్న అన్నారు.

తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ అటవీ శాఖ మెరుగైన పనితీరు కనబరుస్తోందని, ఆగస్టు నెలాఖరు కల్లా అటవీశాఖలో ఖాళీల భర్తీ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఉండేలా కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం పనులు మొదలుపెట్టాలన్నారు. అడవుల బయట హరితహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, అడవుల లోపల సహజ సిద్ధంగా అడవి పునరుజ్జీవనం పొందేలా చర్యలు తీసుకోవటం, క్షీణించిన అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటడం శాఖాపరంగా మొదటి ప్రాధాన్యత కావాలన్నారు.

కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల కోసం సేకరించిన అటవీ భూముల స్థానంలో ప్రత్యామ్నాయ అడవుల పెంపకం ఈ ఏడాది నుంచే మొదలు పెట్టాలన్నారు. రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల్లో సహజ గడ్డి పెంపకం, వేట జంతువుల ఆవాసం పెరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ విధానం అమల్లో పెట్టాలని నిర్ణయించారు.      

More Telugu News