Andhra Pradesh: ప్రభుత్వ పథకాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీఎం అవార్డులు: ఏపీ ఇన్ చార్జి సీఎస్

  • ఉద్యోగులను, బృందాలను.. సీఎం అవార్డులతో సత్కరించనున్నాం
  • పథకాల అమలుకు ప్రభుత్వోద్యోగులు, శాఖలు శ్రమిస్తున్నాయి
  • సీఎం అవార్డుల కోసం దరఖాస్తులను అందజేయాలి: పునేఠ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రభుత్వ పథకాల అమలులో 2017-18 సంవత్సరానికి గానూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను, బృందాలను, శాఖలను, జిల్లాలను సీఎం అవార్డులతో పేరుతో సత్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తులను అందజేయాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

 రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ఇన్ చార్జి ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.ఈ పథకాల వల్ల కోట్లాది మంది లబ్ధి పొందుతూ సంతృప్తికరమైన జీవనం సాగిస్తున్నారని, వీటి అమలులో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆయా శాఖలు ఎంతో శ్రమిస్తున్నట్టు చెప్పారు. అధికారులు, ఆయా శాఖల పనితీరును ప్రశంసిస్తూ సీఎం అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించినట్లు తెలిపారు.

 ఈ అవార్డులను వ్యక్తిగతంగా, శాఖాపరంగా, బృందాలు, జిల్లాల వారీగా అందజేయనున్నామని, 1 ఏప్రిల్, 2017 నుంచి 31 మార్చి, 2018 మధ్యకాలంలో పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. దరఖాస్తులను cmawards.ap.gov.in వెబ్ పోర్టల్ ద్వారా అందజేయాలని సూచించారు.

 పూర్తి వివరాల కోసం cmawardshelpdesk@gmail.com ద్వారా లేదా 08919760285, 0863-2241526 ఫోన్ నెంబర్లలో గానీ సంప్రదించాలని తెలిపారు. అవార్డులకు ఎంపికైన వారికి ఎస్.ఎం.ఎస్.,  మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని అనిల్ చంద్ర పునేఠ పేర్కొన్నారు. 

More Telugu News