Vanaparti: బడికి వెళ్లడం ఇష్టం లేక కిడ్నాప్ డ్రామా ఆడిన బాలిక... నల్లమల అడవుల్లో పోలీసులకు ముప్పు తిప్పలు!

  • అచ్చంపేటలో ఘటన
  • తండ్రి బదిలీతో వేరయిన అన్నాచెల్లెళ్లు
  • అన్న చదివే స్కూల్లోనే చదవాలని కోరుకున్న పాప
  • హైడ్రామా తరువాత ఊపిరి పీల్చుకున్న పోలీసులు

తన తండ్రి వద్ద ఉండి బడికి వెళ్లడం ఇష్టంలేని ఓ బాలిక, స్కూలుకు వెళ్లకుండా, కిడ్నాప్ డ్రామా ఆడి, నల్లమల అడవుల్లో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గతంలో వనపర్తి జిల్లాలో ఆత్మకూరు వీఆర్వోగా పనిచేసిన ఉద్యోగి ఇటీవల బల్మూరుకు బదిలీ అయ్యాడు. ఆయన కుమారుడు ఆత్మకూరులోనే చదువుకుంటుండగా, కుమార్తెను తన వద్దే ఉంచి ఆచ్చంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్చాడు. అయితే, అన్న చదువుతున్న స్కూల్ లోనే చదువుకోవాలన్నది పాప కోరిక.

ఈ క్రమంలో నిన్న ఉదయం పాఠశాలకు బయలుదేరిన బాలిక, స్కూలుకు వెళ్లలేదు. సమయం ముగిసినా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆరాతీసిన తండ్రి, అమ్మాయి స్కూలుకు వెళ్లలేదని తెలుసుకుని ఆందోళన చెందుతుండగా, పుస్తకాల సంచీతో ఇంటికి వచ్చిన కుమార్తె, తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. రెండు వాహనాల్లో వచ్చిన కొందరు అడవుల్లోకి తీసుకెళ్లారని, వారి వద్ద 20 మంది పిల్లలున్నారని, వారు మందు కొడుతుండగా, తాను, మరో బాలిక తప్పించుకుని రంగాపూర్ కు వచ్చి, అక్కడి నుంచి నడుస్తూ వచ్చామని చెప్పింది. తనతో వచ్చిన మరో బాలిక ఎటో వెళ్లిందని ఓ కట్టుకథ అల్లింది.

ఈ విషయాన్ని అచ్చంపేట పోలీసులకు బాలిక తండ్రి సమాచారం ఇవ్వగా, బాలికను వెంటబెట్టుకుని పోలీసులు నల్లమల అడవులను జల్లెడ పట్టారు. చుట్టుపక్కల రహదారులన్నీ బ్లాక్ చేశారు. పాఠశాలకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లన్నీ పరిశీలించారు. ఎటువంటి అనుమానాస్పద వాహనాలు, అడవిలో కిడ్నాపర్ల జాడ తెలియకపోవడంతో, బాలికను గట్టిగా నిలదీసేసరికి విషయం చెప్పేసింది. ఆపై బాలికకు, ఆమె తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు.

More Telugu News