lucknow: లక్నోలో ముస్లిం-హిందూ జంటను అవమానపరిచిన పాస్ పోర్ట్ అధికారి బదిలీ!

  • మతం మారితేనే పాస్ పోర్ట్స్ రెన్యువల్ చేస్తానన్న అధికారిపై వేటు
  • కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆదేశాలు
  • ఆ జంటకు ఇబ్బంది కలిగినందుకు చింతిస్తున్నామన్న మంత్రి 

మతాంతర వివాహం చేసుకున్న ఓ హిందూ-ముస్లిం జంట మొహమ్మద్ అనాస్ సిద్ధిఖి, హిందూ యువతి తన్వి సేథ్ కు ఉత్తరప్రదేశ్ లోని లక్నో పాస్ పోర్ట్ కార్యాలయంలో నిన్న చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయమై ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు తమ ట్వీట్ల ద్వారా ఆ జంట ఫిర్యాదు చేసింది. 

దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్.. సదరు అధికారి వికాస్ ను ట్రాన్స్ పర్ చేయాలని ఆదేశించారు. దీనిపై విదేశాంగ శాఖ కార్యదర్శి డీఎం ములాయ్ కూడా స్పందించారు. ఆ జంటకు ఇబ్బంది కలిగినందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. ఆ జంట పాస్ పోర్ట్స్ ను ఈరోజు రెన్యువల్ చేసినట్టు చెప్పారు. 

 కాగా, ముస్లిం యువకుడు మొహమ్మద్ అనాస్ సిద్ధిఖి, హిందూ యువతి తన్వి సేథ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. నోయిడాలోని ఓ ఎంఎన్సీలో వీళ్లిద్దరూ పనిచేస్తున్నారు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. తమ పాస్ పోర్ట్స్ రెన్యువల్ నిమిత్తం లక్నో లోని కార్యాలయంలో వీరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ కార్యాలయంలో పని చేసే అధికారి వికాస్ వారిపై మండిపడటమే కాకుండా, మొహమ్మద్ ను హిందూమతంలోకి మారాలని చెప్పారు.

తమకు జరిగిన అవమానం భరించలేకపోయిన తన్వి, ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమ పాస్ పోర్ట్ ను సదరు అధికారి హోల్డ్ లో పెట్టారని పేర్కొన్నారు. సిద్ధిఖీ కూడా ఈ మేరకు ట్వీట్లు చేశారు. తమకు సాయం చేయాలని పీఎంఓ, సుష్మా స్వరాజ్ లను కోరారు.

More Telugu News