ap minority corporation: చంద్రబాబు పాలన మైనార్టీలకు స్వర్ణయుగం: ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్

  • మైనార్టీలకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు
  • గడచిన నాలుగేళ్లలో మైనార్టీలకు రూ.2,480 కోట్లు ఖర్చు చేశారు
  • అందుకే, మైనార్టీల ఆత్మీయ బంధువు చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మైనార్టీలకు స్వర్ణయుగం అని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ వర్ణించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ఆ ప్రభావం మైనార్టీలపై పడకుండా వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు.

గడచిన నాలుగేళ్లలో మైనార్టీలకు రూ.2,480 కోట్లు ఖర్చు చేశారని, 2018-19 లో రూ.1106 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశంలో ఏ రాష్ట్రం ఇన్ని నిధులు కేటాయించలేదని, అందుకే చంద్రబాబునాయుడిని మైనార్టీలు ఆత్మీయ బంధువుగా భావిస్తారని సంతోషం వ్యక్తం చేశారు. దుల్హన్‌ పథకం, రోషిణి పథకం, దుకాణ్‌-మకాన్‌ పథకం, ఇమామ్ లకు గౌరవ వేతనం, స్కాలర్ షిప్ వంటి పథకాలను మైనార్టీలకు అందజేస్తున్నట్లు తెలిపారు.

విదేశీ విద్య కోసం ప్రస్తుతం ఇచ్చే రూ.10 లక్షలను రూ.15 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అందువల్ల మైనార్టీలు అందరూ చంద్రబాబుకు అండగా ఉంటారని హిదాయత్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏకగ్రీవంగా మద్దతు పలుకుతామని, రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే స్థాయిలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న చంద్రబాబుకు మైనార్టీ సమాజం అండగా ఉండాలని కోరారు. 

More Telugu News