KTR: పాతబస్తీలో రూ.83 కోట్లతో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

  • శాలిబండ సిగ్న‌ల్ నుండి బీటీ రోడ్డు రీ-కార్పెటింగ్ ప‌నులు షురూ
  • బ‌హ‌దూర్‌పురా ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు ప్రారంభం
  • కిష‌న్‌బాగ్ కుంటలో పార్కు ఓపెనింగ్‌

హైద‌రాబాద్‌లోని పాతబస్తీలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ రూ.83 కోట్లతో ప‌లు అభివృద్ధి పనుల‌ను ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యుడు అస‌దుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు మోజం ఖాన్‌, పాషాఖాద్రీ, మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అరవింద్ కుమార్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్దన్‌రెడ్డి తదిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా రూ.8 కోట్ల వ్య‌యంతో శాలిబండ సిగ్న‌ల్ నుండి మూసాబౌలి జంక్ష‌న్‌, సిటీ కాలేజ్ జంక్ష‌న్ నుండి పురానాపూల్ వ‌ర‌కు నిర్మించే బీటీ రోడ్డు రీ-కార్పెటింగ్ ప‌నుల‌ను కేటీఆర్ పురానాపూల్ వ‌ద్ద‌ ప్రారంభించారు. క్రంబ్ ర‌బ్బ‌ర్ మోడిఫైడ్ బిటుమిన్ (సీఆర్‌ఎంబీ) సాంకేతిక ప‌రిజ్ఞానంతో 3,070 మీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ రోడ్డు వ‌ల్ల పాత‌బ‌స్తీ నుండి ప్ర‌యాణించే వాహ‌నాలకు, ప్ర‌యాణికుల‌కు సౌకర్యంగా వుంటుంది.

అనంత‌రం రూ. 69 కోట్ల వ్య‌యంతో ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నిర్మించ‌నున్న బ‌హ‌దూర్‌పురా ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులను కూడా ప్రారంభించారు. 682 మీట‌ర్ల పొడ‌వు, ఆరు లేన్ల వెడ‌ల్పుతో నిర్మించే ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణం వ‌ల్ల పురానాపూల్ నుండి జూపార్కుకు సులువుగా వెళ్లేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. 2019 వ‌ర‌కు పూర్తయ్యే ఈ ఫ్లైఓవ‌ర్‌తో 2034 సంవ‌త్స‌రం వ‌ర‌కు ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా చూడొచ్చు.

అనంత‌రం కిష‌న్‌బాగ్ కుంటలో నూత‌నంగా నిర్మించిన పార్కును మున్సిప‌ల్ శాఖ మంత్రి ప్రారంభించారు. రూ. 6.20 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన ఈ పార్కు వ‌ల్ల పాత బ‌స్తీవాసుల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన ఉద్యాన‌వ‌నం అందుబాటులోకి వ‌చ్చింది.

More Telugu News