Viral Videos: '10 రోజుల్లో స్పందించాలి'.. రాహుల్‌ గాంధీకి నోటీసులు పంపిన బాలల హక్కుల సంఘం

  • మహారాష్ట్రలో ఇద్దరు దళిత బాలలను కొట్టిన అగ్ర కులస్తులు
  • వీడియో పోస్ట్ చేసిన రాహుల్‌
  • బాలుర గుర్తింపును బయటపెట్టిన నేరం కింద నోటీసులు

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా వకడి అనే గ్రామంలో ఇటీవల జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఆ రాష్ట్ర బాలల హక్కుల సంఘం నోటీసులు పంపించింది. ముంబయికి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు స్వీకరించిన ఆ సంఘం... మైనర్‌ బాలుర గుర్తింపును బయట పెట్టడం నేరమని, అందుకే ఈ నోటీసులు పంపినట్లు పేర్కొంది. నోటీసులపై స్పందిచేందుకు పది రోజుల సమయం ఇచ్చింది.

కాగా, ఇద్దరు దళిత బాలలు ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయగా వారిని పట్టుకున్న కొందరు అగ్రకులస్తులు నగ్నంగా ఊరేగించి కొట్టారు. ఈ వీడియోనే ఇటీవల రాహుల్‌ పోస్ట్ చేస్తూ 'ఈ దళిత బాలలు చేసిన ఏకైక తప్పు ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయడమే.. మానవ జాతి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. బీజేపీ, ఆరెస్సెస్ విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. లేదంటే చరిత్ర మనల్ని క్షమించదు' అని ట్వీట్‌ చేశారు.   

More Telugu News