హైదరాబాద్ లో ఆరడుగుల మేర కుంగిన రోడ్డు!

20-06-2018 Wed 11:07
  • బిజీగా ఉండే బోయినపల్లిలో ఘటన
  • రహదారి కింద ఉన్న డ్రైనేజ్ పైప్ లైన్
  • భయాందోళనల్లో స్థానిక ప్రజలు
హైదరాబాద్ లో నిత్యమూ బిజీగా ఉండే బోయినపల్లి రహదారి ఒక్కసారిగా కుంగిపోగా, ఆరు అడుగుల లోతైన సింక్ హోల్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక్కడి బాపూజీ నగర్ లో ఈ ఘటన జరుగగా, చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలుగు అడుగుల వెడల్పుతో ఆరు అడుగుల లోతైన గుంత పడినట్టు తెలుస్తోంది. ఈ రహదారి కింద శతాబ్దం నాటి రామన్నకుంట చెరువుకు దారితీసే మురుగునీటి పైప్ లైన్ ఉండగా, అది పగిలిందని అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా గుంత ఏర్పడగా, ఆ సమయంలో ఏ మోటారిస్టు లేదా పాదచారులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ రహదార్ల కింద ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎన్నో పైప్ లైన్లు బలహీనమై ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని, వాటిని వెంటనే మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై గుంత పడిన ప్రాంతాన్ని సందర్శించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉమాశంకర్, మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు వివరించారు.