Odisha: పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.44 లక్షలు దోచేసిన దొంగలు

  • ఒడిశాలోని రూర్కెలాలో ఘటన
  • బ్యాంకు సిబ్బందిని గదిలో వేసి బంధించిన దొంగలు
  • లాకర్లు పగలగొట్టి దోపిడీ

ఒడిశాలోని రూర్కెలాలో పట్టపగలు జరిగిన బ్యాంకు దోపిడీ సంచలనమైంది. నగరంలోని మధుసూదన్ లేన్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం యథావిధిగా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 8 మంది దోపిడీ దొంగలు ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించి మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు సిబ్బందిని, బ్యాంకులోని వినియోగదారులను తుపాకితో బెదిరించారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకుని అందరినీ ఓ గదిలో బంధించారు.

అనంతరం లాకర్లను పగలగొట్టి అందులో ఉన్న రూ.44 లక్షలు దోచుకున్నారు. వెళ్తూవెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్‌లను తీసుకుని పరారయ్యారు. మార్గమధ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కచేరి శాఖకు చెందిన ఇద్దరు సిబ్బందిని అడ్డగించి బెదిరించి వారి వద్ద ఉన్న రూ.4 లక్షలు తీసుకుని ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి సోదాలు చేస్తున్నారు.

More Telugu News